ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 23: హిందీ మహావిద్యాలయ కళాశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. కళాశాలలో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు విచారణలో తేలడంతో వేటు వేసింది. 20 19-2022 యూజీ ఆరో సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు, ఉత్తీర్ణులైన ఐదుగురు ఫెయిలైనట్టు తారుమారు చేసిన జాబితాను ఓయూ కంట్రోలర్ ఆఫ్ది ఎగ్జామినేషన్స్కు సమర్పించింది. దీనిపై ఓయూ అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. మార్కుల జాబితాలన్నీ ఫోర్జరీ చేసినట్టుగా కమిటీ నిర్ధారించింది. 2023-24 బ్యాచ్ ట్యాబులేషన్ రికార్డ్స్ (టీఆర్)లో ప్రిన్సిపల్, సీవోఈ సంతకాలు, స్టాం పులు లేనట్టు గుర్తించింది. దీంతో పొరపాట్లు జరిగినట్టు యాజమాన్యం అంగీకరించింది. కానీ, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం తో స్థాయీ సంఘం తీవ్రంగా స్పందించింది. రికార్డులను సీజ్ చేయాలని కంట్రోలర్, సీడీసీ డీన్లను ఆదేశించింది. కళాశాల అటానమస్ ను రద్దు చేయాలని యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులకు సిఫార్సు చేసింది.