 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు బెస్ట్ అవలైబుల్ స్కీమ్‌కు సంబంధించిన బకాయిల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ఆదేశాలను జారీ చేశారు. బెస్ట్ అవలైబుల్ స్కీమ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 230 ప్రైవేట్ పాఠశాలల్లో 26వేల మంది దళిత, గిరిజన విద్యార్థులు ఉచిత విద్యను పొందుతున్న విషయం తెలిసిందే.
ఈ స్కీమ్‌కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా నిధులు విడుదల చేయలేదు. ఇప్పటివరకు రూ.220 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సర్కారు పట్టించుకోకపోవడంతో పాఠశాలల యాజమాన్యాలు పోరుబాట పట్టాయి. విద్యార్థులను పాఠశాలలకు అనుమతించడం లేదు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, దళిత, గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాలు స్పందించాయి. నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం నిధుల విడుదలకు సిద్ధమైంది. ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ప్రత్యేకంగా సమీక్షించారు. బెస్ట్ అవలైబుల్ స్కీమ్‌కు సంబంధించిన బకాయిల్లో రూ. 92 కోట్లను విడుదల చేయాలని ఆదేశించారు.
 
                            