హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) అలైన్మెంట్ను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అధికారులకు సూచించారు. శనివారం ఆయన సచివాలయంలో ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి 2024-25 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో చర్చించారు.
ట్రిపుల్ఆర్ భూసేకరణతోపాటు నల్లగొండ, హైదరాబాద్ కలెక్టరేట్లు, వివిధ ఆర్వోబీలు, ఆర్యూబీలు, వీయూబీల నిర్మాణం, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ నెట్వర్ పెంపునకు బడ్జెట్లో నిధులు కేటాయించాలన్న ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం పరిశీలించారు. రాష్ట్రంలో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్)తో చేపట్టే నిర్మాణాలకు భూసేకరణలో ఇబ్బందులు రాకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి చేసిన విజ్ఞప్తికి అంగీకారం తెలిపారు.
చిన్న సినిమాలకు అడ్డంకులు తొలగించాలి
సినిమాటోగ్రఫీ శాఖపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. చిన్న సినిమాల విడుదలకు ఎదురవుతున్న ప్రతిబంధకాలను తొలగించాలని, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కేటాయించిన భూములను కాపాడలని అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా చేపట్టే ప్రచారంలో పాల్గొనేలా సినీ ప్రముఖులను ఒప్పించేందుకు ప్రయత్నించాలని సూచించారు. సినీ కళాకారులకు అందించే నంది పురస్కారాలపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
థియేటర్లలో చిరుతిళ్ల ధరలను నియంత్రించాలి
సినిమా హాళ్లలో చిరుతిళ్లను భారీ రేట్లకు అమ్మకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని థియేటర్లలో చిరుతిళ్ల ధరలు వందల రెట్లు అధికంగా ఉంటున్నాయని, దీనిపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటి సీఎం సెక్రటరీ కృష్ణభాసర్, ఈన్సీలు రవీందర్రావు, గణపతిరెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.