హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సూచించారు. శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఇందిరా మహిళాశక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి 151 మండల మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ నుంచి వచ్చిన రూ.1.05 కోట్ల అద్దె చెక్కులను అందజేశారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. మహిళా సాధికారతలో తెలంగాణ ఆదర్శంగా నిలిచేందుకు కాంగ్రె స్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు చెప్పారు. మొదటి విడతలో మహిళా సంఘాలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని, రెండో విడతలో ఈ నెల 10 నుంచి 16 వరకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు ఇచ్చి మహిళలను ఓనర్లుగా చేయడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు.