హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): హైటెన్షన్ లైన్ల (హెచ్‌టీ) తరలింపు సేవలను సులభతరం చేయడంలో భాగంగా విద్యుత్తుశాఖ ఆన్లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మింట్ కంపౌండ్‌లోని టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో బుధవారం ప్రారంభించారు. 132, 220, 400 కేవీ వంటి హెచ్‌టీ లైన్ల కొత్త సర్వీసులను పొందడం, ఇప్పటికే ఉన్న సర్వీసులను మరోచోటుకు మార్చడం కోసం ఇక నుంచి వినియోగదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా దరఖాస్తులను అధికారుల నిర్ణీత సమయంలో పరిశీలించి సత్వర సేవలందించేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు భట్టి తెలిపారు. వినియోగదారులు www.tstransco. in, www.tssouthernpower. com, www.tsnpdcl.in వెబ్సైట్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ముర్తుజా అలీ రిజ్వీ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు.