Mallu Bhatti Vikramamarka | మధిర, అక్టోబర్ 29 : కుటుంబ సర్వేతో లక్షలాదిమంది జీవితాల్లో మార్పు వస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ప్రభుత్వం చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మంగళవారం ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సర్వేలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహణ విధి విధానాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల అభ్యున్నతికి, వివిధ సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపర్చడానికి తగిన ప్రణాళికలు రూపొందించేందుకు ఈ సర్వేను ఉపయోగిస్తామని తెలిపారు. నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభించాలని సూచించారు.