‘ప్రజా పాలన -ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’ ప్రణాళికలో భాగంగా గురువారం నుంచి గ్రామసభలు నిర్వహించాలని డిప్యూ టీ సీఎం భట్టివిక్రమార కలెక్టర్లను ఆదేశించారు. సభల్లో ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జూన్ 2 నుంచి అమలుచేయబోతున్న ‘అందరికీ జీవిత బీమా’ పథకం గురించి వివరించాలని సూచించారు. ప్రజాభవన్ నుంచి మంగళవారం సాయంత్రం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో పాలు, రాగి జావ అందిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రచారం కోసం సాంస్కృతిక, పౌర సంబంధాల శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.