Bhatti Vikramarka | సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతిపైసా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. తక్కువ నిధులతో ఎక్కువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. సచివాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రజల తాగు, సాగు నీరు అవసరాలను తీర్చే అవకాశం ఉన్నదన్నారు.
ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కరీంనగర్ జిల్లాకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. తక్కువ బడ్జెట్‌తో వీటిని పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో 4లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్, నక్కలగండి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి టాప్ ప్రియార్టీగా పెట్టుకోవాలన్నారు. రీ డిజైన్ పేరిట గత ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడానికి జాప్యం జరుగుతున్న క్రమంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో డిజైన్ చేసిన రాజీవ్ సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్ఎస్పీఎల్ రెండో జోన్లో కెనాల్‌కు లింక్ చేయడంతో ఖమ్మం జిల్లాలోని రైతులకు సాగునీటి ఎద్దడి లేకుండా ఉంటుందన్నారు.
చెక్ డ్యాంల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. చెక్ డ్యాంల నిర్మాణానికి శాస్త్రీయంగా డిజైన్ చేసుకోవాలన్నారు. మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2024 జూన్ నాటికి పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన వాటి పనులు పూర్తి చేయాలన్నారు. వీటికి నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. వచ్చే సంవత్సరం నాటికి 6లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చే విధంగా ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు.
ఎస్ఎల్బీసీ, నక్కలగండి, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను సముచితంగా ఇవ్వాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులకు వెచ్చించిన నిధులు, చేసిన ఖర్చులు, ఇప్పటి వరకు జరిగిన పురోగతి పనులు, ఇంకా చేయాల్సిన పనుల వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. సమావేశంలో హాజరైన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ మురళీధర్ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.