హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఒడిశాలోని నైనీబ్లాక్‌లో ఈ ఏడాది మార్చి నుంచి బొగ్గు ఉత్పతి చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒడిశాలోని కోణార్లో జరుగుతున్న మూడో జాతీయ మైనింగ్ సదస్సులో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నైనీ ‘క్యాప్టివ్ బ్లాక్’ అని, నిబంధనల ప్రకారం యాజమాన్య సంస్థ అయిన సింగరేణి అవసరాలకే బొగ్గును వాడుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. బొగ్గును మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్‌ప్లాంట్‌కు సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, గని నుంచి ప్లాంట్ దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం లో ఉన్నందున రవాణా సమస్యలు తలెత్తుతాయని, ఈ నేపథ్యంలో గని సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు భూమిని కేటాయించాలని ఒడిశా సీఎంను భట్టి కోరారు. తద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గడంతోపాటు స్థానికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.
కేంద్ర మంత్రికి భట్టి వినతి..
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కోసం ఆర్థిక సాయం కోరుతూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి విక్రమార్క వినతిపత్రం సమర్పించారు. ట్రిపుల్ఆర్, మెట్రో రెండో దశ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్, గోదావరి, మూసీ నదుల అనుసంధానం, సివరేజీ మాస్టర్ ప్లాన్, బందరు పోర్టుకు హైదరాబాద్ మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే, సింగరేణికి బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు ఇతర అంశాలపై సహకారం కోరారు.