హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సౌర విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి గృహ వినియోగదారులకు అవగాహన కల్పించి ప్రో త్సహించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యుత్తు కొరత రాకుండా సౌర విద్యుత్తును పెద్ద మొత్తంలో వినియోగంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మంగళవారం సచివాలయంలో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) ఆధ్వర్యంలో అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ, కమర్షియల్ ఆఫీసు భవనాలపై సౌర విద్యుత్తు వ్యవస్థలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌర విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేవారికి రాయితీలు కల్పించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు గృహ వినియోగదారులకు అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని వెల్లడించారు.