హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ): ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయించుకునే బాధ్యత సంబంధిత అధికారులదేనని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి స్థలసేకరణ, డిజైన్లను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సచివాలయంలో సోమవారం ప్రత్యేక సమీక్షా సమావేశం సందర్భంగా భట్టి మాట్లాడుతూ..
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సూల్ భవనాల నిర్మాణాలకు కావాల్సిన స్థలాన్ని కలెక్టర్లతో సమన్వయం చేసుకొని వేగవంతంగా సేకరించాలని, డిజైన్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రూ. 5వేల కోట్లతో 30 కాంప్లెక్స్‌ల్లో 120 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 8నెలల్లో భవనాలను పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకులాల్లో 100శాతం అడ్మిషన్లు పూర్తి చేయాలని కోరారు. 1029 గురుకుల పాఠశాలల్లో ఇప్పటి వరకు మంచాలు, బెడ్స్, బెడ్‌షీట్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంత మందికి కావాలి? అనే జాబితాను తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన తర్వాత అకడ తీసుకున్న చర్యలపై గురుకులాల సెక్రటరీ రమణకుమార్‌ను డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఓవర్సీస్ సాలర్షిప్ రెండో విడత నిధుల జాబితాను అందజేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. సమీక్షలో ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాసర్, అలుగు వర్షిణి, శరత్ పాల్గొన్నారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి సన్మానించారు. ఉద్యోగ సంఘాల నేతలు శివాజీ, అంజయ్య, వెంకటేశ్వర్లు, మోహన్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. పవర్ జేఏసీ ఆధ్వర్యంలో భట్టి విక్రమార్కను కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు, కో కన్వీనర్ బీసీరెడ్డి, వేణు, భూపాల్‌రెడ్డి, అనిల్, సదానందం, పీవీరావు, వెంకటనారాయణరెడ్డి, అంజయ్య, కిరణ్‌కుమార్, గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.