ఖమ్మం, జూన్ 20: తమ ప్రభుత్వంలో భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలుగదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నిర్మాణాత్మకమైన విమర్శ అవసరమని అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయ మహాసభ ల్లో భాగంగా గురువారం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మీడియా భద్రత కోసం చట్టాన్ని తేవాలనే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచనతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.
ఆ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపు త్వరలోనే జరుగుతుందన్నారు. అనంతరం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయ మహాసభల ముగింపు సందర్భంగా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా విరాహత్ అలీ, కే రాంనారాయణ ఎన్నికయ్యారు. ముగ్గురు ఉపాధ్యక్షులు, మరో ముగ్గురు కార్యదర్శులు, 16 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.