హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండి. పన్నుల నుంచి మాకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ప్రజా భవన్లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసా, అధిక భద్రతను కల్పిస్తాయి. కేంద్ర పథకాలను వినియోగించుకోవాలంటే తరచూ కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. ఫలితంగా కేంద్ర ప్రాయోజిక పథకాలను పొందడంలో రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రాలు తమ అవసరాలు కనుగుణంగా కేంద్ర ప్రయత పథకాలను రూపొందించడానికి స్వయం ప్రతిపత్తిని అందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కీలక దశలో ఉన్నది. సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడంతో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించడానికి అవకాశం ఉంది. ఇది తెలంగాణ డిమాండ్ కాదు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. చారిత్రిక కారణాలవల్ల అసమాన అభివృద్ధి ఇక్కడ ఉందని చెప్పారు. తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికి సంపద, ఆదాయంలో అంతరం ఉంది. ఇలాంటి అసమానతల మూలంగానే రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైంది. అసమానతల పరిష్కారానికి మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగంపై గణనీయంగా ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు.