Sunkishala | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): సుంకిశాల ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం మింట్ కంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కథనాన్ని చూపుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో భట్టి చేసిన వ్యాఖ్యలు..అవి ఒట్టి బూటకం అనేందుకు ఉదాహరణలు కొన్ని.
భట్టి: కృష్ణానదిలో డెడ్‌స్టోరేజీ నుంచి కూడా హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు తెచ్చేందుకు సుంకిశాల పథకం చేపడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదం జరిగేలా నిర్మాణం చేపడుతుందనే అర్థం వచ్చేలా ‘నమస్తే తెలంగాణ’లో ఒక కథను వండి వార్చారు.
వాస్తవం: సుంకిశాల ఘటన జరిగిందని, వారం రోజులుగా బయటి ప్రపంచానికి తెలియదని, పెను ప్రమాదం తప్పిందని జరిగిన సంఘటనను మాత్రమే ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టు చేసింది. అందులో చూపిన వీడియో ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులు తీసినది కాదు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్నవారు, పథకం పనులను నిర్వహిస్తున్న వారు చిత్రీకరించింది. అందులో జరిగిన దృశ్యాలనే వార్తలో ప్రస్తావించారే తప్ప సొంత కవిత్వంతో రాసిన కథనం కాదు అది. వాస్తవం చెబితే భుజాలు ఎందుకు తడుముకున్నారో మరి!
భట్టి: సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11.6.2021నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలుపెట్టారు. జూలై 2, 2023 నాడు కుప్పకూలిన వాల్ నిర్మాణం జరిగింది. కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
వాస్తవం: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం, నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయనేది వాస్తవం. కానీ సుంకిశాల ఘటనకు కారణమైన గేటు అమరిక, సొరంగాన్ని ఓపెన్ చేసే పనులు గత నెలలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగాయి. గోడ కుప్పకూలేందుకు కారణం పనుల్లో నాణ్యత లోపం కాదు. రిటెయినింగ్ వాల్ నిర్మాణ డిజైన్ అంతకంటే కాదు. ప్రతికూల సమయంలో హడావుడి, అనాలోచిత నిర్ణయం కారణంగా ప్రమాదం జరిగింది. స్వయానా జలమండలి అధికారులు అధికారికంగా ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఈ వాస్తవం స్పష్టంగా ఉంది.
భట్టి: సాగర్‌లోకి నీళ్లొచ్చాయట.. కూలిందట! సాగర్‌లోకి నీళ్లు రాకుంటే ఏమొస్తాయ్. సాగర్ కట్టిందే నీళ్ల కోసం. ఆ నీళ్ల నుంచే కదా పంపుహౌజ్ ద్వారా నీళ్లు తెచ్చుకుందామని కట్టుకుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే కదా కట్టాల్సింది. డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా అర్థమవుతున్నది. మీ పాలన, మీ పర్యవేక్షణ ఎలా ఉన్నాయో అర్థమవుతున్నది.
వాస్తవం: సాగర్‌లోకి ఊహించని రీతిలో, ఊహించని సమయంలో నీళ్లు వచ్చాయి. అందుకే ఈ ప్రమాదం జరిగిందనేది జలమండలి అధికారుల అధికారిక ప్రకటన సారాంశం. అధికారులు, ఏజెన్సీకి ఈ కఠోర వాస్తవం తెలియదు కాబోలు. సాగర్ అంటే అందులో నీళ్లుండవు, నీటి కోసమే సాగర్ నిర్మాణం చేపట్టారనే వాస్తవాలు తెలిక సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్ చేశారేమో! దాని ఫలితంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు. డిజైన్లు, నాణ్యత అనేవి ప్రమాదానికి కారణం కాదని జలమండలి అధికారులే స్పష్టం చేశారు. ఇక, పాలన, పర్యవేక్షణ అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ఆ బాధ్యత ఎవరిదనేది పురపాలక శాఖ పోర్టుఫోలియో నిర్వహిస్తున్న వారికే తెలియాలి.
భట్టి: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గోడ కూలిందనే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది మేం కట్టిందీ కాదు.. కట్టించిందీ కాదు. మా హయాంలో మొదలు పెట్టిందీ కాదు. తమరి (బీఆర్ఎస్) పుణ్యమే ఇది కూడా. ఒళ్లు గగుర్పొడిచే వీడియో కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని గొప్పగా మార్కెట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఎవరి మీదనో బురద చల్లేందుకు ప్రయత్నం చేశారు.
వాస్తవం: కట్టింది, కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాకపోవచ్చుగానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలకు రిటెయినింగ్ వాల్ కుప్పకూలిందనేది నిర్వివాదాంశం. ఇక, ఒళ్లు గగుర్పొడిచే వీడియో అంటే.. ఘటన జరిగి వారం రోజులైనా ప్రభుత్వం దానిని దాచి పెట్టింది. సంఘటన జరిగిందనే వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యతనే ‘నమస్తే తెలంగాణ’ నిర్వర్తించింది. ఆ వీడియోను బయటి ప్రపంచానికి చూపించింది. గత పది, పదిహేను రోజుల్లో ఇంజినీర్లు తీసుకున్న నిర్ణయాలే ప్రమాదానికి కారణమనేది జలమండలి వివరణలోనూ ఉన్నందున పాపమో.. పుణ్యమో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది కాదని తేలింది.
కొసమెరుపు: నాగార్జున సాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ కట్టింది. కృష్ణాకు భారీ వరద వచ్చినప్పుడు, దానిని గమనిస్తూ ప్రభుత్వం సకాలంలో గేట్లు తెరవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తప్పుకు బాధ్యత సాగర్ ప్రాజెక్టు కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానిది అవుతుందా? లేక, అధికారంలో ఉండి నిర్లక్ష్యం వహించిన అప్పటి ప్రభుత్వానిది అవుతుందా? భట్టిగారు చెప్పాలి.