Toll Tax | హైదరాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇకపై గ్రామీణ రోడ్లపై కూడా టోల్ ట్యాక్స్ విధించనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రభుత్వ చర్యలు అందుకు ఊతమిస్తున్నాయి. రూ.28 వేల కోట్లతో హ్యామ్ విధానంలో 17 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బుధవారం బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్- హెచ్ఏఎం) విధానంలో అభివృద్ధి చేసే రోడ్లపై టోల్ ట్యాక్స్ వసూలు చేసుకునే వెసులుబాటు ఉండటం గమనార్హం.
పీపీపీ విధానంలో…
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో రోడ్డు పనులు చేపట్టే విధానమే హ్యామ్. ఈ విధానంలో ప్రాజెక్టు వ్యయం లో 40 శాతం మొత్తాన్ని ఐదేండ్లలో ఏటా కొంత చొప్పున గ్రాంటు రూపంలో ప్రభుత్వం అందించనుండగా.. మిగిలిన 60శాతం నిధులను సంబంధిత ఏజెన్సీలు రుణం రూపంలోనో లేక ఈక్విటీ రూపంలో సమకూర్చుకోవాల్సి ఉంటుం ది. అనంతరం వారు పెట్టిన పెట్టుబడి వడ్డీతోపాటు ఏటా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. లేనిపక్షంలో టోల్ విధానంలో వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. 15 ఏండ్లపాటు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రోడ్లు, భవనాల అభివృద్ధికి బడ్జెట్లో రూ.5,907కోట్లు కేటాయించింది.
ట్రిపుల్ ఆర్కు మొండిచేయి
రీజినల్ రింగురోడ్డు(ట్రిపుల్ఆర్) ప్రాజెక్టుకు బడ్జెట్లో మొండిచేయి ఎదురైంది. సుమారు రూ.35 వేల కోట్ల అంచనాతో ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఈ ప్రా జెక్టును చేపడుతున్నప్పటికీ కేంద్రంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది. రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్ల ప్రక్రియతోపాటు భూసేకరణ పనులు కొనసాగుతుండగా, దక్షిణ భాగం రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొత్తం రెండు భాగాలకు భూసేకరణ కోసం దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. అయితే కనీసం ఉత్తర భాగానికి భూసేకరణ కోసం కూడా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం విశేషం.