హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరంలో ఇచ్చే పాఠ్యపుస్తకాలను ఏ మీడియంలో ముద్రించాలన్న అంశంపై విద్యాశాఖ, విద్యా కమిషన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యాకమిషన్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపర్చగా, విద్యాశాఖ మరోదారిలో ముందుకెళ్తున్నది. ఈ విషయంలో రెండింటికీ పొసగని పరిస్థితి నెలకొన్నది. ప్రతియేటా రాష్ట్రంలోని 1-10 విద్యార్థుల కోసం ద్విభాషా పుస్తకాలను ముద్రిస్తున్న విషయం తెలిసిందే. ఒకే పుస్తకంలో కుడి వైపు పేజీని తెలుగులో, ఎడమ వైపు పేజీని ఇంగ్లిష్లో ముద్రిస్తున్నారు. ఈ విధానంతో నష్టం జరుగుతుందన్న భావనలో విద్యాకమిషన్ ఉన్నది. విద్యార్థులు ఇంగ్లిష్ నైపుణ్యాలు నేర్చుకోలేకపోతున్నారని, దీనంతటికీ పుస్తకాలు తెలుగులో ఉండటమే కారణమన్న అభిప్రాయానికి వచ్చింది. మొత్తం ఇంగ్లిష్లోనే పుస్తకాలు ముద్రించాలన్న భావనతో ఉన్నది.
ఇదిలా ఉండగా, వచ్చే విద్యాసంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియను ఇటీవలే విద్యాశాఖ ప్రారంభించింది. వచ్చే ఏడాదికి ద్విభాషా పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించింది. పేజీలో ఒకవైపు తెలుగు, మరో వైపు ఇంగ్లిష్లో పాఠ్యపుస్తకాలు ఉండనున్నాయి. ద్విభాషా పుస్తకాల వినియోగంపై ఇటీవలే విద్యాకమిషన్ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. అయితే తెలుగు మీడియాన్ని పూర్తిగా ఎత్తివేసి, కేవలం ఇంగ్లిష్ మీడియంలోనే ముద్రించాలని నిర్ణయానికి వచ్చింది. ఇదే అంశంపై ‘తెలుగు మాధ్యమానికి మంగళం’ పేరుతో నమస్తే తెలంగాణ కథనాన్ని ప్రచురించింది. దీంతో తెలుగు భాషాభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈక్రమంలో వచ్చే విద్యాసంవత్సరంలో పాఠ్యపుస్తకాలను తెలుగులోనూ ముద్రించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ తల్లి చిత్రపటం, తెలంగాణ గీతం ముద్రించాలని నిర్ణయించినట్టు చెప్పారు.