హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు మందకొడిగా సాగుతున్నది. యాసంగిలో 46.49 లక్షల ఎకరాల్లో పంటల సాగు అవుతుందని అంచనా వేయగా ఇప్పటివరకు 28 శాతం మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 13,13,389 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. గతేడాది ఇదే సమయానికి సాగైన విస్తీర్ణం కంటే 1.09 లక్షల ఎకరాలు తక్కువ. గతేడాది జనవరి మొదటి వారానికి 14,03,059 ఎకరాలు సాగైంది. గత యాసంగితో పోలిస్తే ఈసారి వేరుశనగ, శనగ పంటల సాగు విస్తీర్ణం పెరిగి, వరి సాగు విస్తీర్ణం తగ్గినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది.