మహబూబాబాద్ రూరల్, మే 20: ఓ మహిళా అటెండర్‌ను కొద్దిరోజులుగా డీఈవో మానసికంగా వేధిస్తుండటంతో బాధితురాలు సోమవారం ఆఫీసు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పార్వతి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణం ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటూ.. 2017 నుంచి మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నది.
గతంలో ఇద్దరు డీఈవోల దగ్గర కూడా పనిచేసింది. అయితే.. ఏడాది కాలంగా విధులు సక్రమంగా నిర్వహించడం లేదంటూ తరచూ డీఈవో రామారావు పార్వతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆఫీస్‌లో పని అయిపోయిన తర్వాత కూడా ఫోన్ చేసి కార్యాలయానికి పిలిపించేవాడు. డీఈవో చెప్పిన పని చేస్తేనే జాబ్ రెన్యూవల్ చేస్తానని, లేకపోతే జాబ్ నుంచి తొలగిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
రాత్రి 7.30 గంటల సమయంలో ఫోన్ చేసి ఆఫీస్‌కు పిలిచేవాడని, వచ్చిన తర్వాత ఏ పనీ చెప్పకుండా.. తాను వెళ్లే వరకు ఆఫీస్‌లోనే కూర్చో అని వేధించేవాడు. గత నెల జీతం ఇవ్వకపోగా.. వచ్చే నెల నుంచి ఆఫీస్‌కు రావొద్దని బెదిరించడంతోపాటు ఉద్యోగులందరూ అటెండర్‌తో ఎవరూ మాట్లాడొద్దని హుకుం జారీ చేశాడు. ఆఫీసులో ఆమెకు కేటాయించిన రిజిస్టర్, స్టూల్‌ను కూడా తీసేయడంతో రెండు రోజుల నుంచి కిందనే కూర్చుంటున్నది. డీఈవో వేధింపులకు విసుగు చెందిన పార్వతి ఆఫీస్ ఎదుట నిరసన తెలిపినట్టు వాపోయింది. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నది.