Dengue Fever | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జ్వరాలతో తెలంగాణ అల్లాడుతున్నది. ప్రభుత్వం ముందుచూపు లేకపోవడం.. వైద్య, ఆరోగ్య శాఖకు ‘మందుల’చూపు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా, ఇతర విష జ్వరాల విజృంభణతో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు నిండిపోయాయి. ప్రభుత్వ దవాఖానల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తుండగా నగరంలోని కొన్ని కార్పొరేట్ దవాఖానలు ‘మా హాస్పిటల్లో బెడ్స్ ఖాళీగా లేవు. వేరే హాస్పిటల్‌కు వెళ్లండి’ అని గేటు నుంచే వెనక్కి పంపుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ‘మేం సర్వే చేస్తున్నప్పుడు ప్రతి పది మందిలో కనీసం ముగ్గురు, నలుగురు జ్వరం ఉన్నట్టు చెప్తున్నారు’ అని ఆరోగ్య సిబ్బంది వెల్లడిస్తున్నారు. అంటే ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు కనిపిస్తున్నారు. మరోవైపు దవాఖానల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ (సీడీఎస్)లో నిల్వలు అడుగంటాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఒకే అధికారి, ఒకే రోజు రెండు తీర్ల లెక్కలు
డెంగ్యూ కేసుల లెక్కల్లో ప్రభుత్వం ప్రకటిస్తున్నదానికి, వాస్తవ పరిస్థితులకు భారీ వ్యత్యాసం ఉన్నదని మొదటి నుంచీ ఆరోపణలున్నాయి. దీన్ని నిజం చేస్తూ డీపీహెచ్ రవీందర్ నాయక్ ఒకేరోజు విడుదల చేసిన లెక్కల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తున్నది.
వేధిస్తున్న మందుల కొరత
రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీల నుంచి టీచింగ్ వైద్యశాలల వరకు మందుల కొరత ఉన్నట్టు వైద్యసిబ్బంది చెప్తున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి దవాఖానలకు మందులు సరఫరా అవుతుంటాయి. కానీ, ఈ నెల 23 నాటికి సీడీఎస్లోనే 31 రకాల ట్యాబ్లెట్లు, 19 రకాల ఇంజిక్షన్లు, 11 సర్జికల్ ఐటమ్స్, 21 రకాల సిరప్లు లేవని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా జ్వర బాధితులు, ఇతర రోగులకు దవాఖానల్లో అందించే చికిత్సలో వాడే మందులు కూడా కరువయ్యాయని చెప్తున్నారు. దీంతో దవాఖానల నుంచి ఇండెంట్లు వచ్చినా సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లుగా బఫర్ స్టాక్‌తో నెట్టుకొచ్చామని, అది కూడా అడుగంటిందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దవాఖానల్లో 40 శాతం వరకు మందుల కొరత ఉన్నట్టు చెప్తున్నారు. ‘సూపరింటెండెంట్ల ఖాతాలో ఉన్న ఆరోగ్యశ్రీ నిధుల నుంచి నెట్టుకొస్తున్నాం. అత్యవసర మందులు, పరికరాలు కొనుగోలు చేస్తున్నాం. అయినా కొరత తీరడం లేదు’ అని ఓ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. టీజీఎంఎస్ ఐడీసీకి మందులు సరఫరా చేసే సరఫరాదారులు, డీలర్లకు ప్రభుత్వం సుమారు రూ.600 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టినట్టు సమాచారం. అందుకే వారు సరఫరా నిలిపివేశారని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, మందులు సరఫరా చేయాలని కోరుతున్నారు.
డెంగ్యూ మరణాల్లేవు : వైద్యశాఖ
రాష్ట్రంలో ఈ నెల 23 నాటికి ఒక్క డెంగ్యూ మరణం కూడా నమోదు కాలేదని వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ నెల 23న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘పడకేసిన ప్రజారోగ్యం’ కథనానికి వైద్యశాఖ వివరణ ఇచ్చింది. కథనంలో పేర్కొన్న 8 మరణాలు కూడా డెంగ్యూకు సంబంధించినవి కావని, ఇతర కారణాలతోనే రోగులు మరణించారని పేర్కొన్నది. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఈ ఏడాది మే నుంచే చర్యలు చేపట్టామని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వ్యాధులు, దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారుల బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నదని తెలిపారు.