TNGOs Colony | మైలార్దేవ్పల్లి, అక్టోబర్ 23: ‘లక్షలాది రూపాయలు కూడబెట్టి స్థలాలు కొన్నాం. రాత్రికి రాత్రి వచ్చి నిర్మాణాలను అక్రమంగా కూల్చి వేస్తున్నారు’ అంటూ పలువురు బాధితులు గగ్గోలు పెట్టారు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్జీవోస్ కాలనీ సర్వే నం 156/1లోని నిర్మాణాలను బుధవారం ఉదయం పోలీసుల భారీ బందోబస్తు నడుము రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. స్థలాల చుట్టూ ఉన్న ప్రహరీ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు.
ఈ సందర్భంగా బాధితులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. కొందరు రాళ్లతో జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు వారిని వారించి అక్కడ నుంచి పంపించి నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు హెచ్చరించారు. ఇక్కడ ప్రభుత్వ స్థలాలను కొందరు ఆక్రమించి కబ్జాలు చేశారని, అందుకే నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు.