రంగారెడ్డి, మే 18 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం సర్వేనంబర్ 10/95లోని ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాన్ని ఆదివారం అధికారులు కూల్చివేశారు. ‘గుడి పేరుతో ప్రభుత్వ భూమికి బురిడీ’ శీర్షికతో ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన తహసీల్దార్ సుదర్శన్ అధికారులతో కలిసి గ్రామానికి వెళ్లి జేసీబీ సాయంతో కట్టడాన్ని కూల్చివేయించారు. ప్లాట్లు చేయటానికి చదును చేసిన భూమిలోనూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కొత్తగూడెం గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టంచేశారు. ఆలయం నిర్మాణానికి రావాలని కొందరు వ్యక్తులు ఆహ్వానిస్తే భూమిపూజకు వెళ్లినట్టు చెప్పారు. అక్కడ ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నట్టు తనకు తెలియదని పేర్కొన్నారు. తన పేరును వాడుకుని అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.