నిర్మల్, మే 5 (నమస్తే తెలంగాణ) : శ్రీవేదభారతీ పీఠం నిర్వాహకుడు విద్యానందగిరి స్వామి.. వేదం ముసుగులో వ్యాపారం చేస్తున్నాడని బాసర గ్రామస్థులు ఆరోపించారు. గోదావరి హారతి, బీజాక్షరం పేరిట వసూళ్ల దందా చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. గోదావరి హారతి పేరిట ఘాట్ స్థలాన్ని కబ్జా చేశారని తెలిపారు. ఇటీవల వేద పాఠశాలలో విద్యార్థి లోహిత్‌పై దాడి జరిగినా, ఘటన ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? కారకులు ఎవరు? అనే వాస్తవాలు బయటకురాలేదని చెప్పారు. లోహిత్‌కు సన్నిహితుడైన మణికంఠ అనే విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోవడం పలు అనుమానాలు కలిగిస్తున్నదని తెలిపారు. లోహిత్ కేసులో సాక్షిగా ఉన్న మణికంఠను పక్కా ప్లాన్‌తోనే హత్య చేశారని వినతి పత్రంలోనే పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఇన్ని జరుగుతున్నా విద్యానందగిరిపై పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని వాపోయారు. స్వామితోపాటు ఆయన అనుచరులపై పూర్తిస్థాయి విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాసర గ్రామస్థుల విజ్ఞప్తిపై కలెక్టర్ అభిలాష అభినవ్ సానుకూలంగా స్పందించారు. స్వామీ కార్యకలాపాలపై విచారణ చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. త్వరలోనే పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ.. విద్యానందగిరిపై ఇప్పటికే విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. కొన్ని కీలకమైన ఆధారాల సేకరణలో ఉన్నామని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. గ్రామస్థులు సహకరించాలని కోరారు.