హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): దళిత ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కవంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, లక్ష్మీకాంత్, కాలే యాదయ్య మంగళవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. లక్ష్మణ్‌కు జరిగిన అవమానంపై చర్చించారు. మంత్రి పొన్నంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలతో దళిత ఎమ్మెల్యేలు నొచ్చుకున్నది నిజమేనని, బుధవారం ఇద్దరిని గాంధీభవన్ పిలిచి మాట్లాడి వివాదాన్ని పరిష్కరిస్తానని వెల్లడించారు.
ఎస్సీ ప్రజాప్రతినిధులంటే ద్వేషమెందుకు?: మేడె
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ ప్రజాప్రతినిధులంటే కాంగ్రెస్‌కు ద్వేషమెందుకు?.. కావాలనే దళితమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కించపరిచేలా కాంగ్రెస్.. మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో అనుచిత వ్యాఖ్యలు చేయించిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ ఆరోపించారు. దళిత ప్రజాప్రతినిధులను కించపరచడం కాంగ్రెస్ సర్కారుకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. సహచర మంత్రిపై అసభ్యకర దూషణలు రాజకీయ సంస్కృతికి విరుద్ధమని, మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.