జనగామ చౌరస్తా, నవంబర్ 5: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నదని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని గానుగుపహాడ్, చీటకోడూరు గ్రామాల్లో బ్రిడ్జీలు నిర్మించాలని నిరసన తెలిపిన ఐదుగురు యువకులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు బనాయించి బెయిల్ రాకుండా 15 రోజుల పాటు జైలుకు తరలించడంపై ఆయన మండిపడ్డారు. బుధవారం ఆయన జనగామ సబ్ జైలులో ఉన్న ఐదుగురు యువకులు కరుణాకర్, రఘు, ఏలేందర్రెడ్డి, ఉమాపతి, రాజును బీఆర్ఎస్ శ్రేణులు, ఆయా గ్రామాల ప్రజలతో కలిసి పరామర్శించారు. వారికి బెయిల్ త్వరగా వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. గానుగుపహాడ్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి రూ.90 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తే అక్కడ మిగతా పనులు పూర్తయి బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో స్పీకర్ ద్వారా బ్రిడ్జి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రెండేళ్లు గడుస్తున్నా ఏ మాత్రం స్పందించని మంత్రి ఫొటోను గాడిదకు తగిలించి నిరసన తెలిపితే తప్పేంటని ప్రశ్నించారు. మంత్రులు దండుపాళ్యం ముఠాగా తయారయ్యారని ధ్వజమెత్తారు. నేరస్థులు, దొంగలను పట్టుకోవడం చేతకాని జనగామ పోలీసులు.. ఎవరో చెప్పారని అమాయక ప్రజలను జైలుకు పంపుతూ ప్రభు భక్తిని చాటుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వారం రోజుల్లో గానుగుపహాడ్, చీటకోడూరు బ్రిడ్జిల నిర్మాణ పనులు ప్రారంభించకపోతే వేలాది మంది ప్రజలు, వందలాది గాడిదలు, దున్నపోతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం చీటకోడూరు, గానుగుపహాడ్‌కు చెందిన పలువురు గ్రామస్థులు, బీఆర్ఎస్ శ్రేణులు సుమారు 300 మందితో కలిసి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద జనగామ-సిద్దిపేట రహదారిపై ఎమ్మెల్యే పల్లా ధర్నా నిర్వహించారు.