ఖమ్మం/జనగామ చౌరస్తా, అక్టోబర్ 15 : రిటైర్డ్ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మం, జనగామ కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించారు. ఖమ్మంలో ధర్నా శిబిరం నుంచి కలెక్టర్ కార్యాలయంలోకి పెన్షనర్లు ప్లకార్డులతో ప్రదర్శనగా వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కళ్యాణం కృష్ణయ్య మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలు, బకాయిలను విడుదల చేయకుండా తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 18 నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలను విడుదల చేయకపోవడంతో కొంతమంది మానసిక ఆవేదనతో చనిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
జనగామలో ఆందోళన..
రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు బందారపు లక్ష్మయ్య మాట్లాడుతూ.. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నదని ఆరోపించారు. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఇండ్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.