కవాడిగూడ, మే 22: రాష్ట్రంలోని బీసీ సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశాయి. కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని కోరాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జనసభ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు బీసీ సంఘాల ప్రతినిధులు బుధవారం మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఫలితాల తర్వాత ఎలాంటి రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కులగణన, సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్..
వాటిని విస్మరించి మరోసారి బీసీలను మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రాంకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామ్మూర్తిగౌడ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఎలిచాల దత్తాత్రేయ, నాయకులు రాజు ముదిరాజ్, గోవర్ధన్‌యాదవ్, వెంకట్నేత, బీసీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కర్నాడి శ్రీనివాస్, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి రాజు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే జూన్ 8న మహాధర్నా నిర్వహించడంతోపాటు 15న సచివాలయాన్ని ముట్టడిస్తామని రాజారాంయాదవ్ హెచ్చరించారు. కులగణన పేరుతో ఎన్నికల్లో లబ్ధిపొందిన కాంగ్రెస్ మరోసారి బీసీలను వంచించేందుకు సిద్ధమైందని దుయ్యబట్టారు. దశాబ్దాల సామాజికవర్గాల న్యాయమైన డిమాం డ్ కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.