హైదరాబాద్, అక్టోబర్26 (నమస్తే తెలంగాణ): స్వయంప్రతిపత్తి కలిగిన డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, ప్రామాణిక పద్ధతులతోనే కుల సర్వేను నిర్వహించాలని, లేదంటే న్యాయపరమైన వివాదాలు తప్పవని కులసంఘాల ప్రతినిధులు, న్యాయకోవిదులు హెచ్చరించారు. కులసర్వే ప్రశ్నావళి, అందులో చేర్చాల్సిన అంశాలపై అఖిలపక్షంతో చర్చించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘కులగణన’లో సవాళ్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అభిప్రాయాల సేకరణ తదితర అంశాలపై పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్, తెలంగాణ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ సంయుక్తంగా పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించాయి. పబ్లిక్ హియరింగ్ జ్యూరీ ప్యానెల్‌గా జస్టిస్ వీ చంద్రకుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఓయూ జర్నలిజం శాఖ పూర్వ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ప్రధాన సమన్వయకర్తలుగా ప్రొఫెసర్ మురళీమనోహర్, దేవుల సమ్మయ్య వ్యవహరించారు. పబ్లిక్ హియరింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర కులసంఘాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ఇంటింటి సమగ్ర కులసర్వేకు సంబంధించిన ప్రశ్నావళి అంశాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంబించే ప్రామాణిక పద్ధతులను ప్రజలకు వివరించాలని ఘంటాపథంగా తెలిపారు. బిహార్‌లో నిర్వహించిన కులసర్వేలో నిర్దిష్ట విధానాలను అవలంబించకపోవడంతో పాట్నా హైకోర్టు అకడి రిజర్వేషన్ల పెంపు చట్టాన్ని కొట్టివేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కులగణన కోసం జారీ చేస్తున్న జీవోలకు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయని, దీంతో బీహార్ తరహా ఇబ్బందులొస్తాయని పేర్కొన్నారు.
పబ్లిక్ హియరింగ్‌లో వ్యక్తమైన అభిప్రాయాల నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని దేవల సమ్మయ్య, మురళీమనోహర్ వెల్లడించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ సుదర్శన్‌రావు, ప్రొఫెసర్ భాగయ్య, డాక్టర్ పృథ్వీరాజ్‌యాదవ్, సతీశ్ కొట్టె, వినోద్ కుర్వ, డాక్టర్ వేణుయాదవ్, డాక్టర్ తుల్జారాం సింగ్, డాక్టర్ విజయ్‌కుమార్, కేపీ మురళీకృష్ణ, వితోబా, నరహరి, నిమ్మల వీరన్న, సీహెచ్ ఉపేంద్ర, విజయేందర్‌సాగర్, పిల్లి రాజమౌళి, కొన్నె శంకర్‌గౌడ్ , అనిల్‌కుమార్, తుమ్మనాపల్లి శ్రీనివాస్ , చింతగింజ శ్రీహరిరావు, శివశంకర్‌యాదవ్, డాక్టర్ శోపరి శంకర్, పొన్నం దేవరాజ్‌గౌడ్, సేనాపతి, సుమారు 150 కుల సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల విషయ నిపుణులు, సామాజికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.