BC Reservations | హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా కాకుండా పార్టీపరంగానే 42% కోటా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వెనకబడిన వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ దగా చేస్తున్నదని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగానే రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా పాతరేస్తామని హెచ్చరిస్తున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అటకెక్కించేందుకు కాంగ్రెస్ ఆదినుంచీ ఉద్దేశపూర్వకంగానే లోపభూయిష్టమైన విధానాలను అమలుచేస్తున్నదని, ఇప్పుడు పార్టీ కోటా అంటూ మరో కొత్త డ్రామాకు తెరతీసిందని బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు, బీసీ మేధావులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు అశాస్త్రీయ విధానాలతో ఇంటింటి సర్వేను నిర్వహించి ఆదిలోనే బీసీలను వంచించిందని మండిపడుతున్నారు. అసంబద్ధమైన గణాంకాల ఆధారంగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, స్థానికసంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లులు పెట్టి, మరోసారి వంచించిందని ఆరోపిస్తున్నారు.
అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినా, దానిని గవర్నర్‌తో ఆమోదింపజేసేందుకు ఎలాంటి చొరవ తీసుకోలేదని, ఇది కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని రగిలిపోతున్నారు. చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ అమలుచేయాలనే ఉద్దేశం కాంగ్రెస్‌కు ఏకోశాన లేదని, మభ్యపెట్టేందుకే కులగణన, బిల్లుల ఆమోదం తప్ప మరేమీలేదని బీసీ సమాజం మండిపడుతున్నది. ఇప్పుడు పార్టీ కోటాలోనే 42% రిజర్వేషన్ అమలుచేసేందుకు పూనుకోవడమే అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని అమలుచేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు, అదీకూడా బీసీ ఉపకులాల వారీగా కల్పించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీసీలకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా మోసం చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇక మంత్రి పదవుల్లోనూ, నామినెటెడ్ పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదని మండిపడుతున్నారు. బీసీ విదార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
బీసీలను కాంగ్రెస్ మరోమారు మోసగించింది. బీసీలపై ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదు. స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగరంగాల్లో చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలుకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అవేవీ చేయకుండా పార్టీ కోటా అనడం సిగ్గుచేటు. ఇది బీసీ వర్గాలను మరోసారి మోసగించడమే. చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలుపరచాలి. లేదంటే మరో ఉద్యమం తప్పదు. బీసీలకు ఏదీ చెప్పినా నమ్ముతారు అనుకుంటే పొరపాటే.
42% రిజర్వేషన్ల పెంపుపై రేవంత్‌రెడ్డి సర్కార్ బీసీలను దగా చేస్తున్నది. చట్టబద్ధంగా కాకుండా పార్టీపరంగా ఇస్తామనడం మోసం చేయడమే. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా తప్పించుకోవాలని చూస్తే, బుద్ధి చెప్పకతప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదినుంచీ బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. చట్టబద్ధంగా రిజర్వేషన్లను అమలుచేయకుండా తప్పించుకోవాలని చూస్తే రాష్ట్రంలో మరో సంగ్రామం తప్పదు.
బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీపరంగా కల్పిస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమే. ఇటువంటి నిర్ణయాన్ని బీసీ ప్రజలు అంగీకరించరు. ఒకవైపు బీసీల కులగణన దేశానికే ఆదర్శమని, రాహుల్‌గాంధీ అభినవ అంబేద్కర్ అని ఢిల్లీలో గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అందుకు పూర్తి విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ద్రోహాన్ని గ్రామ గ్రామం తిరిగి వివరిస్తాం. బీసీ ప్రజలను చైతన్య పరుస్తాం.
బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే చేతులు కాల్చుకోక తప్పదు. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. తక్షణమే బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాలు, మేధావులు, న్యాయ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలి. లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతాం. బీసీ సంఘాలు, మేధావులతో చర్చించి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం.