అమరచింత, ఏప్రిల్ 15 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు పోరుబాట పట్టారు. మస్తీపూర్, నందిమళ్ల, సింగంపేట, మూలమల్ల తదితర గ్రామాలకు చెందిన 200 మంది రైతులు డ్యాం వద్దకు చేరుకొని ప్రధాన రహదారిపై బారికేడ్లతోపాటు ముళ్లకంపలు అడ్డంగా వేసి గంటసేపు బైఠాయించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో 35 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశామన్నారు. పంట చేతికందాలంటే ఇంకా రెండు వారాల పాటు సాగునీళ్లు వదలాలని, లేదంటే పంటలు ఎండిపోయి పెట్టుబడికి తెచ్చిన అప్పు మీదపడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. పంటలు ఎండితే తమకు చావే శరణ్యమని హెచ్చరించారు. ఎమ్మెల్యే శ్రీహరి వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని భీష్మించుకు కూర్చున్నారు.
పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. ససేమిరా అనడంతో వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా ఆత్మకూర్ మండలం అరెపల్లి, కత్తెపల్లి, గుంటిపల్లి, మోట్లంపల్లి గ్రామాల రైతులు సాగునీరు ఎప్పుడిస్తారని మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు జూరాల ఎడమ కాల్వ మోటర్ల వద్ద పడిగాపులు కాశారు. ప్రాజెక్టు వద్ద కనిపించిన వారందరినీ సాగునీటి కోసం వేడుకున్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి వందసార్లు ఫోన్లు చేసినా ఎత్తడంలేదని రైతులు వాపోయారు. పంటలు ఎండుతుంటే తిన్న కూడు తిండి ఒంటికి పట్టడంలేదని దిగాలుచెందారు. నీళ్లు ఎప్పుడు అందుతాయా..? అంటూ అక్కడే వేచిఉన్నారు.