హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ఈ సారి 1.97లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఫస్టియర్‌లో చేరారు. నిరుడు 1.96లక్షల మంది చేరగా, ఈ సారి వెయ్యి మంది అధికంగా అడ్మిషన్లు పొందారు. దోస్త్ మూడు విడతల్లో 1,43,691 మంది చేరగా, స్పెషల్ ఫేజ్‌లో మరో 54,048 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. దీంతో ఈ సారి అడ్మిషన్లు 1.97లక్షల మార్కు దాటాయి. రాష్ట్రం లో మొత్తం 960 కాలేజీలుండగా, 4,38,926 సీట్లున్నాయి. ఈ సారి 1,97,739 సీట్లు నిండాయి.
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) స్పెషల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ సీట్లను బుధవారం కేటాయించారు. ఈ సారి 57,338 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 54,048 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. కామర్స్‌లో అత్యధికంంగా 22,328 మంది, ఫిజికల్ సైన్స్‌లో 12,211 మంది, లైఫ్ సైన్స్‌లో 10,435 మంది, ఆర్ట్స్ కోర్సుల్లో 8,979 మంది చొప్పున సీట్లు దక్కించుకున్నారు. సీట్లు దక్కించుకున్న వారు 8లోపు ఆన్లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.