హైదరాబాద్, జూలై13 (నమస్తే తెలంగాణ): డెయిరీ కోర్సులకు ఇటీవల బాగా డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీకి అనుబంధంగా ఉన్న కామారెడ్డి ప్రభుత్వ బీటెక్ కళాశాల డెయిరీ కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇంటర్లో ఎంపీసీ చదివిన విద్యార్థులకు ఎప్సెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్లో అడ్మిషన్ లభించనున్నది. మొత్తం కళాశాలలో 44సీట్లు ఉంటే.. వీటిలో 6 సీట్లను రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కేటాయించనున్నారు. కొంతకాలంగా డెయిరీ కోర్సు చదివిన విద్యార్థులకు ప్రముఖ డెయిరీ కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగావకాశాలు లభిస్తుండటంతో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశాలకు భారీగా డిమాండ్ పెరిగినట్టు వెటర్నరీ విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు.
డెయిరీలో ఉద్యోగాలు..
డెయిరీ టెక్నాలజిస్ట్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డెయిరీప్లాంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర ఉద్యోగాలు పొందవచ్చు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్రంగాల్లో డెయిరీ ఫారాల నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ల వరకు అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.