హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ తర్వాత మిర్చి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి దిగుబడులు తగ్గడం, పచ్చళ్ల సీజన్ కావడంతో మిరపపొడి తయారీకి ఉపయోగించే మిర్చికి బాగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని వరంగల్, మలక్‌పేట్ మార్కెట్‌తోపాటు గుంటూరు మిర్చియార్డులో 341, దేవనూరు డీలక్స్ రకాలకు ధర బాగా పెరిగింది. దేవనూరు డీలక్స్ రకం మిర్చి ధర క్వింటా రూ. 4వేలకు పైగా ధర పెరగగా, 341, 334, నంబర్-5 రకం మిర్చిలు ధరలు పెరిగి డీలక్స్ రకంతో మిర్చితో పోటీపడుతున్నాయి. గత నెల రోజులుగా గుంటూరు మిర్చియార్డుకు కారం మిర్చి సరఫరా బాగా తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈనెల 6న క్వింటా రూ.20,500 పలికిన ఈ మిరపకాయల ధరలు..క్రమంగా పెరుగుతూ రూ.23వేలకు చేరింది. ముఖ్యంగా 341,355, దేవనూర్ డీలక్స్ వంటి రకాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దిగుబడులు తగ్గడం, కారం మిల్లులు, పచ్చళ్ల తయారీలో ఈ రకాలకు మంచి ఆదరణ ఉండటంతో వీటి ధరలు అమాంతంగా పెరిగాయి. ఇతర వ్యాపారుల్లో కొందరు ప్రస్తుతం మిర్చికి డిమాండ్ ఉండటంతో మిర్చిని స్టోర్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, చాలాకాలంగా పడిపోయిన మిర్చి ధరలు ప్రస్తుతం పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.