Govt Hospital | నీలగిరి, ఆగస్టు 23: పురిటినొప్పులతో కాన్పు కోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లిన నిండు గర్భిణి అర్ధరాత్రి నానా అవస్థలు పడింది. మొదట సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్తే డాక్టర్లు లేరు. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్ర దవాఖానకు అంబులెన్స్‌లో వస్తే, చివరకు కుర్చీలోనే ప్రసవించాల్సిన దుస్థితి ఎదురైంది. అదృష్టవశాత్తు తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని నిండు గర్భిణి. గురువారం రాత్రి 10 గంటలకు పురుటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు.
అక్కడ డ్యూటీ డాక్టర్, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో నర్సులు నల్లగొండ జిల్లా దవాఖానకు వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో బయల్దేరి అర్ధరాత్రి 12:30 గంటలకు నల్లగొండలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ నిఖిత, నర్సులు పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉన్నదని చెప్పారు. 30 నిమిషాల తరువాత రెండోసారి బీపీ చెక్ చేసి బాగానే ఉన్నదన్నారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో అశ్వినిని వాకింగ్ చేయాలని సూచించడంతో వాకింగ్ చేస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నది. నిమిషాల వ్యవధిలో కుర్చీలోనే శిశువుకు జన్మనిచ్చింది. అశ్విని తల్లి బిడ్డను గట్టిగా పట్టుకుని వెంటనే డాక్టర్‌ను పిలిచింది.
అదృష్టవశాత్తు బిడ్డకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. లేబర్‌రూమ్ నుంచి వచ్చిన సిబ్బంది అశ్వినిని వార్డులోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఘటనపై కలెక్టర్ సీ నారాయణరెడ్డి ఆదేశం మేరకు అదనపు కలెక్టర్ టీ పూర్ణచంద్ర శుక్రవారం జిల్లా దవాఖానను సందర్శించారు. అశ్విని, ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దవాఖాన పర్యవేక్షకులు, ఆర్ఎంవో, డ్యూటీ డాక్టర్లతో మాట్లాడారు. అనంతరం దేవరకొండ ప్రభుత్వ దవాఖానలో విధుల్లో లేని డ్యూటీ డాక్టర్ శాంతిస్వరూప, విధుల్లో ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టాఫ్ నర్సులు విజయలక్ష్మి, సైదమ్మ, మౌనిక, సరితను సస్పెండ్ చేయాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. నల్లగొండ దవాఖానలోని డ్యూటీ డాక్టర్, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
అశ్విని మూడో కాన్పు కోసం దేవరకొండ దవాఖానకు వెళ్లగా అక్కడ వైద్యులు లేకపోవడంతో నల్లగొండ జిల్లా దవాఖానకు పంపారు. ఇక్కడ రెండుసార్లు పరీక్షించిన వైద్యులు డెలివరీకి ఇంకా సమయం ఉన్నట్టు గుర్తించారు. ఆగి ఆగి నొప్పులు వస్తుండటంతో లేబర్ రూమ్‌లోకి వెళ్లి బట్టలు మార్చుకోవాలని సూచించారు. ప్రసవానికి ఇంకా సమయం ఉండటంతో వైద్య నిబంధనల ప్రకారం వాకింగ్ చేయాలని చెప్పారు. రాత్రి 2 గంటల సమయలో అశ్విని నడుస్తుండగా, లేబర్ రూమ్ ముందు నొప్పులు ఎక్కువై అక్కడే ఉన్న కుర్చీలో బిడ్డను ప్రసవించింది. డాక్టర్లు, సిబ్బంది వెంటనే వచ్చి వైద్యసేవలు అందించారు. ఈ ఘటనలో గురువారం రాత్రి డ్యూటీలో ఉండాల్సిన దేవరకొండ దవాఖాన డ్యూటీ డాక్టర్‌తోపాటు విధుల్లో ఉన్న నర్సులను సస్పెండ్ చేయాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించాం. నల్లగొండ దవాఖానకు సంబంధించి అనుభవం ఉన్న వారి సహాయం లేకుండా వాకింగ్ చేయాలని సలహా ఇవ్వడం వల్ల కుర్చీలోనే ప్రసవం జరిగిందని గుర్తించాం. అందుకు బాధ్యులైన డ్యూటీ డాక్టర్ నిఖితతోపాటు నలుగురు స్టాఫ్ నర్సులకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం. వారి వివరణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం.
-టీ పూర్ణచంద్ర, ఆదనపు కలెక్టర్, నల్లగొండ
సర్కారు దవాఖానను నమ్ముకుంటే నిర్లక్ష్యం చేశారు
నా భార్యకు మొదటి రెండు కాన్పులు దేవరకొండ ప్రభుత్వ దవాఖానలోనే అయ్యాయి. గురువారం రాత్రి మూడో కాన్పు కోసం వెళ్తే అక్కడ నిర్లక్ష్యం చేశారు. నిద్రమత్తులో ఉండి కనీసం చెక్ చేయకుండా నల్లగొండ దవాఖానకు పంపించారు. ఇక్కడికి వస్తే డెలీవరికి టైమ్ ఉన్నదని వాకింగ్ చేయాలని చెప్పారు. వాకింగ్ చేస్తుండగా నొప్పులు రావడంతో నా భార్య కుర్చీలోనే ప్రసవించింది.
-ఆంజనేయులు, అశ్విని భర్త