ఎల్లారెడ్డిపేట, మే 22: నెల రోజుల కింద వడ్లు తెచ్చిన ఓ రైతు విసిగిపోయాడు. తన సీరియల్ నంబర్ ఎప్పుడు వస్తుందని, ఎప్పుడు తూకం వేస్తారంటూ ఆగ్రహించి కొనుగోలు కేంద్రంలోనే ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న రెవెన్యూ, పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించాడు. శనివారం లోగా కొనకపోతే కలెక్టర్ వచ్చేదాకా కదిలేది లేదని స్పష్టం చేశాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన బాధిత రైతు గన్న రాజు మాటల్లోనే.. ‘నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేసిన. సుమారు 400 బస్తాల వడ్లు నెల కింద మా ఊరు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన. రోజు కేంద్రం సుట్టూ తిరుగుతున్న. కొనెటోళ్లు లేరు.
నా సీరియల్ నంబర్ 115. నా కంటే వెనకున్న కొందరు రైతుల తూకం అయిపోయింది. నా సీరియల్ నంబర్ మాత్రం వస్తలేదు. ఇంకెప్పుడు వస్తదో.. ఇంకెప్పుడు తూకం వేస్తరో..’ అని ఆవేదన చెందాడు. నెల రోజులైనా ధాన్యం కొంటలేరని, సీరియల్ నంబర్లో తేడాలు జరుగుతున్నాయని, అందుకే ఆత్మహత్యాయత్నం చేశానని చెబుతున్నాడు. తన ధాన్యం డబ్బులు పడకపోతే పిల్లల ఫీజులు ఎలా కట్టాలని వాపోతున్నాడు. రేపటి వరకు కొంటామని హామీ ఇచ్చారని, శనివారంలోగా కొనకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేశాడు.