ఓదెల, అక్టోబర్ 24: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో దీపావళి సెలవులు కావడంతో ఇంటికి వచ్చిన డిగ్రీ విద్యార్థిని పాముకాటుకు గురై మృతి చెందిన విషాద ఘటన రూపు నారాయణపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రం అక్షిత(18) అనే డిగ్రీ విద్యార్థినికి శుక్రవారం పాముకాటుకు గురై మృత్యువాత పడింది.
అక్షిత సుల్తానాబాద్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల డిగ్రీ కాలేజీలో చదువుతోంది. దీపావళి పండుగ సందర్భంగా సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. శుక్రవారం కాలేజీకి పోతా అంటే తల్లి శుక్రవారం రోజు ఎందుకు వద్దు అనడంతో ఇంటి వద్దనే ఉండిపోయింది. తండ్రి శ్రీనివాస్ దివ్యాంగుడు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో తల్లి కోమల కూలీ చేస్తేనే కుటుంబ పోషణ సాగుతుంది. దీంతో బిడ్డను ఇంటి వద్ద ఉంచి తల్లి పత్తి పంటను ఏరెందుకు కూలికి వెళ్ళింది. ఇంటి వద్ద అక్షిత కుర్చీలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటుండగా పాము కాలుకు కాటు వేసింది. దీంతో వెంటనే తేరుకుని తనను ఏదో కుట్టిందని అరవడంతో ఇంటి పరిసర ప్రాంత ప్రజలు పరిగెత్తుకు వచ్చి చూడగా కుర్చీ కింద పాము ఉన్నట్లు గుర్తించారు. పామును కొడదామని లోపే అక్కడి నుంచి పారిపోయింది. విషయం తల్లికి ఫోన్ ద్వారా తెలియజేయడంతో ఇంటికి వచ్చి అక్షితను మొదటగా తీసుకువెళ్లి అక్కడి నుంచి 108 ఆంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. డిగ్రీ విద్యార్థి పాముకాటుతో మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. కాగా తల్లి, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. శ్రీనివాస్ గౌడ్, కోమల దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా అక్షిత పెద్దది. ఈ మేరకు పోత్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.