పాల్వంచ రూరల్, జూలై 27: ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కొట్లాటలో డిగ్రీ విద్యార్థి మృతిచెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలు ఎస్సీ కాలనీకి చెందిన అల్లూరి విష్ణు (21) లక్ష్మీదేవిపల్లి(ఎస్) డిగ్రీ కాలేజీలో సెకండి యర్ చదువుతున్నాడు. ఇంటర్ చదివే విద్యార్థులకు, విష్ణుకు పాతకక్షలు ఉన్నాయి. పాల్వంచలోని ఆర్సీఎం చర్చి వద్ద శనివారం విష్ణు, ఇంటర్ విద్యార్థులకు ఘర్షణ జరిగింది. కాలేజీలో కూడా గొడవ జరగగా, బయటకు వచ్చి భద్రాచలం ప్రధాన రహదారి పక్కన దాగి ఉన్న కొందరు ఇంటర్ విద్యార్థులు విష్ణు పై దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అదే సమయంలో ఆటోలో భద్రాచలం వెళ్తున్న విష్ణు బంధువులు చూసి పాల్వంచ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విష్ణు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
రైలు కింద పడి ఉద్యమనేత బలవన్మరణం
నల్లబెల్లి, జూలై 27: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లబెల్లికి చెందిన వడ్లూరి సత్యం(48) తెలంగాణ మలిదశ ఉద్య మంలో చురుకుగా పాల్గొన్నాడు. 2012 సెప్టెంబర్ 30న హుస్సేన్‌సాగర్ వద్ద చేపట్టిన సాగరహారంలో పాల్గొనగా, పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిని స్పృహ కోల్పోయాడు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వైద్య సేవలందించడంలో సహకరించారు. సత్యం ఆరోగ్య రీత్యా కోలుకున్నా.. మతిస్థిమితం కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి, సత్యం భార్య రాణికి కస్తూర్బా పాఠశాలలో ఉద్యోగం కల్పించారు. శనివారం ఉదయం నల్లబెల్లి నుంచి ఆర్టీసీ బస్సులో వరంగల్‌కు చేరుకున్న సత్యం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.