హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళా విద్యకు దిక్సూచిలా ఏర్పాటైన తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం (ఉమెన్ యూనివర్సిటీ)లో ఈ ఏడాది 1,740 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా భర్తీచేస్తారు. కోఠి మహిళా కళాశాలను వర్సిటీగా అప్గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. అనుబంధ కాలేజీలు లేకుండానే ఒకే కాలేజీలో ఉన్న 1,740 సీట్లు సాధించిన అభ్యర్థులకు మహిళా వర్సిటీ పేరుతో పట్టాలను జారీచేస్తారు.
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 978 కాలేజీల్లో 4,20,470 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 978 కాలేజీలకు అధికారులు అఫిలియేషన్లు ఇచ్చారు. త్వరలోనే మరికొన్ని కాలేజీలకు గుర్తింపు ఇవ్వనున్న నేపథ్యంలో సీట్లు సైతం పెరుగుతాయి. మొదటి విడత కౌన్సెలింగ్లో భాగంగా 1.44 లక్షల విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారు. వీరిలో 1.15 లక్షలకుపైగా వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. ఈ నెల 6న తొలివిడత సీట్లను కేటాయించనున్నారు. 7వ తేదీ నుంచి రెండోవిడత అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభంకానున్నది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఫలితాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఎంసెట్ తొలి విడత ప్రవేశాలు ముగిసిన తర్వాత విద్యార్థుల చేరికతో దోస్త్ ప్రవేశాలు జోరందుకునే అవకాశాలున్నాయి.
నాలుగేండ్లుగా డిగ్రీ కోర్సుల్లో ఏటా సీట్లు పెరుగుతున్నాయి. కోర్సులు, సబ్జెక్టుల కాంబినేషన్ల సంఖ్య సైతం పెరుగుతుండటం విశేషం. జీరో అడ్మిషన్ కాలేజీలను మూసివేసినా, వాటిల్లో సీట్లకు కోతపెట్టినా ఏటా సీట్ల సంఖ్య పెరుగుతున్నది. పలు కాలేజీలు కొత్తకోర్సుల వైపు దృష్టిపెట్టడమే ఇందుకు కారణం.