హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన పోరులో రేవంత్ ఘోరంగా ఓడిపోయారు. కోమటి రెడ్డి తన పంతం నెగ్గించుకోగా.. రేవంత్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారు. రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించగా, ‘నువ్వు మా జిల్లాకు రావాల్సిన అవసరం లేదు’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒకవేళ రేవంత్ సభ నిర్వహించినా తాను హాజరు కానని స్పష్టం చేశారు. అన్నట్టుగానే శుక్రవారం నిర్వహించిన సభకు కోమటిరెడ్డి సోదరులు, వారి వర్గం మొత్తం డుమ్మా కొట్టింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గం మాత్రమే హాజరైంది.