Kancha Gachibowli | కొండాపూర్, మే 16: పాపం.. నిలువ నీడలేక, తాగడానికి నీళ్లు లేక కంచ గచ్చిబౌలి జింకలు అవస్థ పడుతున్నాయి. ఈ భూముల్లోని అడవిని రేవంత్ సర్కార్ ఇష్టమొచ్చినట్టు తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇటీవల జనావాసాల్లోకి వచ్చిన జింకల చిత్రాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కుక్కల దాడిలో మరణించిన జింకల ఫొటోలు మనను కదలించిన సంగతి విదితమే. తాజాగా ఆ మూగజీవాలు గొంతు తడుపుకోవడానికి మురుగు నీరే గతైంది. కంపు కొడుతున్నప్పటికీ ముక్కు మూసుకోని గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి.
శుక్రవారం నల్లగండ్ల నవోదయకాలనీ నుంచి వెలువడుతున్న డ్రైనేజీ నీటిని పలు జింకలు తాగుతూ కనిపించాయి. ఆ మురుగు నీటిలోనే సంచరించాయి. మురుగునీటిలో తిరుగుతున్న జింకలను పలువురు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మురుగునీటిలో తిరుగుతున్న జింకల ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన పాపానికి వన్యప్రాణులు తమ నివాసాలను కోల్పోయి.. ఇలా డ్రైనేజీ మురుగులో తిరుగుతున్నాయంటూ పలువురు సోషల్ మీడియాలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు.