Spotted Deer | హైదరాబాద్, మే18(నమస్తేతెలంగాణ): రాష్ట్ర జంతువు మచ్చల జింకకు రక్షణ లేకుండాపోయింది. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో చీటల్ లేదా మచ్చల జింకలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. గడిచిన వారంలోనే దామగుండం అడవిలో 6 మచ్చల జింకలు ప్రాణాలు కోల్పోయాయి. అవన్నీ వీధికుక్కల దాడులకు బలవుతున్నాయి. కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అడవిలోని ప్రసిద్ధ శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో ఆశ్రయం పొందుతున్నాయి. అక్కడ కూడా వీధికుక్కల వేటుకు బలవుతున్నాయి. శనివారం ఆలయ గుండంలో ఒక జింక కళేబరాన్ని గుర్తించారు.
అదే ప్రదేశంలో మరొక జింక ప్రాణాలు కాపాడుకునేందుకు తిరుగుతూ కనిపించింది. ఈ విషయంపై ఆలయానికి సమీపంలో ఆశ్రమం నడుపుతున్న సత్యానందస్వామి, కొందరు భక్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. భక్తులు దేవుడిని దర్శించుకోవడానికి ఈ గుడికి వస్తుంటే, జింకలు మాత్రం చనిపోవడానికి వస్తున్నాయని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జింకలు చనిపోతున్నాయని అటవీ అధికారులకు సమాచారం ఇస్తే.. వాళ్లొచ్చి జింకల కళేబరాలను తీసుకెళ్తున్నారే కానీ.. ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేకాకుండా నాలుగు కొమ్ముల జింకలు, ఇతర జంతు, పక్షి జాతులూ అంతరించిపోతున్నాయని స్థానికులు తెలిపారు.
నేవీ రాడార్ ప్రాజెక్టు కోసం అటవీ ప్రాంతాన్ని పెద్దఎత్తున తొలగించిన తర్వాత జింకల మరణాలు పెరిగాయని స్థానికులు చెప్తున్నారు. ప్రాజెక్టు కోసం పని చేస్తున్న కార్మికుల తాత్కాలిక కాలనీల చుట్టూ కుక్కల సంచారం బాగా పెరిగింది. వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర జంతువును రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
అటవీశాఖ అధికారులకు సమాచారమిస్తే.. వీధి కుక్కలను నియంత్రించడం తమ పరిధిలోకి రాదని, వాటిని అదుపులో ఉంచాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదేనని సమాధానమిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. స్థానిక సంస్థలు సైతం వీధికుక్కల నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని తెలిపారు. దీంతో ఇంకా మిగిలి ఉన్న మచ్చల జింకలకు ప్రాణహాని పొంచి ఉన్నట్టేనని ఆందోళన వ్యక్తమవుతున్నది.