పాలకుర్తి, మార్చి 18: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో శుక్రవారం సోమనాథ కళాపీఠం ఆధ్వర్యంలో తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి 783వ లింగైక్యతిథి దీపారాధన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమనాథుని విగ్రహానికి దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్యశర్మ పూలమాల వేసి దీపారాధన చేశారు. సోమనాథుడు పాలకుర్తిలో జన్మించడం మన అదృష్టమన్నారు. ఆయన మహాకవియే కాక బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. కార్యక్రమంలో సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షుడు రాపోలు సత్యనారాయణ, ఆలయ ఈవో రజనీకుమారి, అర్చకులు దేవగరి లక్ష్మన్న, కళాపీఠం అధ్యక్షురాలు రాపోలు శోభారాణి పాల్గొన్నారు.