ఇచ్చోడ, నవంబర్ 28 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో శుక్రవారం ముందస్తుగానే దీక్షా దివస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఉద్యమ నేత, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని ఎడ్లబండిపై పెట్టి గ్రామంలో డప్పు చప్పుళ్లతో ర్యాలీ తీశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే గొప్ప త్యాగ నిరతితో 2009 నవంబర్ 29న దీక్ష చేపట్టి కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు.
కేసీఆర్ లేకపోతే 300 ఏళ్లయినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపారన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీనాక్షి, సుభాష్, గ్రామస్థులు పాల్గొన్నారు.