BRS Leader Kishore Goud | స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించడానికి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ పార్టీ విజయం అని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిశోర్ గౌడ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు త్రిబుల్ టెస్టులో భాగంగా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తప్పును సరిదిద్దుకుని ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామని కిశోర్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పోరాట విజయం అని పేర్కొన్నారు.
తొలి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూనే ఉంటుందని కిశోర్ గౌడ్ తెలిపారు. రాజకీయమైన లబ్ధి కోసమో, ఎన్నికల ప్రయోజనం కోసమో కాకుండా శాశ్వతమైన పరిష్కారం లభించేలా బీసీల రిజర్వేషన్ల స్థిరీకరణ ఉండాలని పేర్కొన్నారు. అందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపామన్నారు. కామరెడ్డి బీసీ డిక్లరేషన్తోపాటు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. లేని పక్షంలో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ రిజర్వేషన్లు అమలయ్యే వరకూ బీసీల పక్షాన పోరాడుతుందని తెలిపారు.