హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): జూన్ 2నే ఆర్టీసీ కార్మికుల అపాయింటెడ్ డే ప్రకటించేలా ప్రభుత్వానికి తమ గోడు వినిపించాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు రాజ్యసభ ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామ్‌రెడ్డికి విన్నవించారు. గురువారం వేం నరేందర్‌రెడ్డి నివాసంలో వారిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు మాట్లాడుతూ.. యూనియన్ ఎన్నికలకంటే ముందుగా జూన్ 2న ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించే విధంగా ప్రత్యేకచొరవ తీసుకోవాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం తగిన నిధులను విడుదల చేయాలని కోరారు.
ఈ సందర్భంగా వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకొంటుందని చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా తదితరులు ఉన్నారు.