హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 20 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో కేబుల్ వైర్ల కత్తిరింపుతో ఇంటర్నెట్ యూజర్ల బాధలు తారాస్థాయికి చేరాయి. ప్రభుత్వం విద్యుత్తు వైర్లను సరిచేయలేక.. కేబుల్, ఇంటర్నెట్ వైర్లను కత్తిరించడమేంటని యూజర్లు మండిపడుతున్నారు. యూజర్ల ఆగ్రహం, ఆపరేటర్ల ఆందోళనలను పట్టించుకోని విద్యుత్తు సిబ్బంది కేబుల్స్ కత్తిరింపు బుధవారం కొనసాగించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కేబుల్స్ కట్ చేసి రోడ్లపై కుప్పలుకుప్పలుగా పడేశారు. రెండురోజుల క్రితం నగరంలో విద్యుత్‌షాక్‌తో 8 మంది మృతి చెందడంతో టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం కేబుల్ కటింగ్ చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశాలతోనే ఈ ప్రక్రియ చేపట్టినట్టు అధికారులు స్పష్టంచేశారు. ఇంటర్నెట్, డిష్, టెలిఫోన్ కేబుల్స్ కట్ చేస్తూ రోడ్లపై పారేయడంతో ఇంటర్నెట్ ప్రొవైడర్లు, కేబుల్ ఆపరేటర్లు తలలు పట్టుకున్నారు. దీంతో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ స్పెషల్ డ్రైవ్‌ను పదిరోజులు కొనసాగిస్తామని విద్యుత్తు సిబ్బంది స్పష్టంచేశారు. కేబుల్స్ తొలగింపు జరుగుతుండగానే ఇంటర్నెట్ ప్రొవైడర్ల సిబ్బంది పునరుద్ధరణ చర్యల కోసం తంటాలు పడుతున్నారు.
నగరంలో ఎస్పీడీసీఎల్ సిబ్బంది ఇంటర్నెట్, డిష్ కేబుల్స్ కట్ చేయడంపై తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం మింట్‌కాంపౌండ్‌లోని దక్షిణ డిస్కం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సంబంధం లేని అంశాలను ముడిపెడుతున్నారని, కేబుల్ వైర్ నుంచి కరెంట్ పాస్ అవదని, విద్యుత్ ప్రమాద ఘటనలకు కేబుల్స్ కారణమని ప్రకటించడం కరెక్ట్ కాదని అన్నారు. కేబుల్ కటింగ్ ఆపాలంటూ డిమాండ్ చేశారు. ఆ తర్వాత టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీతో భేటీ అయ్యారు. పదిహేను ఫీట్లపైన ఉన్న కేబుల్స్ తొలగించబోమని, అంతకంటే కింద ఉంటే తొలగిస్తామని సీఎండీ చెప్పినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. చర్చలు సఫలమయ్యాయని, తాత్కాలికంగా కేబుల్ కటింగ్ ఉండదని సీఎండీ చెప్పినట్టు కేబుల్ ఆపరేటర్లు తెలిపారు. డిప్యూటీ సీఎం అందుబాటులో లేరని, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి చెప్తామని ముషారఫ్ తెలిపారని మరికొందరు ఆపరేటర్లు వెల్లడించారు.