హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ) : సహజత్వానికి భిన్నంగా పంటల్లో జరిగే జన్యుమార్పిడిని వ్యతిరేకించాలని, ఈ విధానం నిలిపివేతకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్‌రెడ్డి అధ్యక్షతన జన్యుమార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జన్యుమార్పిడి విధానాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. జన్యుమార్పిడితో రైతులు విత్తన స్వాతంత్య్రం కోల్పోవడమే కాకుండా విత్తనాలు కార్పొరేట్ రంగం చేతుల్లోకి వెళ్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. జన్యుమార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే విషయంపై దేశవ్యాప్తంగా రైతులతోపాటు వినియోగదారులను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచన విధానానికి స్వస్తి పలికేలా ముందుకుసాగుదామని నిర్ణయించారు. సమావేశంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.