హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): 2021లో తన సొంత బిడ్డను నరబలి ఇచ్చిన బానోత్ భారతికి సూర్యాపేట కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. చిన్నారి మరణానికి దారితీసిన చర్య భౌతికంగా నిందితురాలి వల్లే జరిగిందని అయితే ఆ సమయంలో ఆ తల్లి తీవ్ర మానసిక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నదని తేల్చింది. అలాంటివారికి భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 84 రక్షణ కల్పిస్తున్నదని చెప్పింది. నిర్దోషిగా విడుదల కావడానికి ఆమె అర్హురాలని తీర్పులో పేరొంది. సూర్యాపేట జిల్లా, మోతె మండలం, మేకలపాటి తండాలో 2021, ఏప్రిల్ 15న దారుణ ఘటన చోటుచేసుకుంది. భారతి అనే మహిళ ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తూ, ఏడు నెలల తన పసికందు గొంతు, నాలుక కోసింది. ఆమెకున్న ‘సర్ప దోషం’ తొలగిపోవాలనే మూఢనమ్మకంతో ఈ దారుణానికి ఒడిగట్టిందని అభియోగం. ఈ కేసులో సూర్యాపేట కోర్టు భారతికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆమె హైకోర్టులో అప్పీల్ చేశారు.
పెంచిన టికెట్ ధరలను ప్రభుత్వానికి జమచేయాలి ;మనశంకరవరప్రసాద్ సినిమాపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు టికెట్ల పెంపు ద్వారా వచ్చిందంటున్న రూ.42 కోట్ల రాబడి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరలు పెంచుకొనేందుకు అనుమతిస్తూ ఈ నెల 8న హోంశాఖ ముఖ్యకార్యదర్శి మెమో జారీచేశారు. టికెట్ల ధర పెంపు ద్వారా రూ.42 కోట్లు ఆర్జించారని, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మెమో జారీచేసినందున, ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ శుక్రవారం విచారించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి టికెట్ ధరలను పెంచుకొనేందుకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి జారీచేసిన మెమో చెల్లదని న్యాయవాది వాదించారు. దర్శకుడు అనిల్ రావిపూడి, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు, బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ జొమాటో.. ఆయా రోజుల్లో అక్రమంగా పొందిన రూ.42 కోట్లను ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.