వేములవాడ, జూన్ 4: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో మూగజీవాల మృత్యుఘోష వినిపిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం జీవాలకు శాపంగా మారాయి. ఆరు రోజుల్లో 28 కోడెలు మృత్యువాతపడట్టు అధికారులు చెప్తున్నా.. అనధికారికంగా మరెన్నో మృతిచెందాయనే ప్రచారం జరుగుతున్నది. అపరిశుభ్ర వాతావరణంలో పరిమితికి మించి సంరక్షించడం, ఆరు నెలలుగా రైతులకు కోడెల పంపిణీలో జాప్యమే కారణంగా కనిపిస్తున్నది. భక్తులు, రైతులు తమ ఇంటి నుంచి నిజ కోడెలను ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి మొకులను సమర్పిస్తుంటారు. ఆ తర్వాత నేరుగా వేములవాడ పట్టణ శివారులోని తిప్పాపురం గోశాలకు వెళ్లి అప్పగిస్తుంటారు. ఇలా స్వామివారికి ప్రతినెలా దాదాపు 80-100 వరకు నిజ కోడెలు వస్తున్నాయి.
పరిమితికి మించి కోడెలు..అపరిశుభ్ర వాతావరణం
ఏడెకరాల స్థలంలో ఉన్న తిప్పాపూర్ గోశాలలో కోడెల సంరక్షణకు 12 షెడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ 500 నుంచి 600 కోడెలను సంరక్షించే స్థలం, అందుకు తగ్గట్టుగానే వసతులు ఉండగా, భక్తులు సమర్పించే నిజకోడెలతో వాటి సంఖ్య రెండింతలైంది. ఇటీవల వరుస వర్షాలతో గోశాల పరిసరాలు బురదమయంగా, అపరిశుభ్రంగా మారడంతో అవి రోగాల బారినపడుతున్నాయని, దీనికితోడు మోతాదుకు తగ్గట్టుగా మేత అందకపోవడంతో నీరసించి మృతిచెందుతున్నట్టు ఇటీవల పశువైద్యాధికారులు నిర్ధారించారు. పరిమితికి మించి రాజన్న కోడెలను సంరక్షిస్తుండటంతో తొక్కిసలాటలు జరిగి మృత్యువాతపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మే 30న కోడెల మృతిని అధికారికంగా ధ్రువీకరించారు. అధికారులు చెప్పిన లెకల ప్రకారం మే 30న 8 కోడెలు, 31న ఐదు, జూన్ 1న ఐదు, 2న మూడు కోడెలు, మూడో తేదీన ఆరు, నాలుగో తేదీన ఒక కోడె మృతిచెందగా, ఇప్పటివరకు మొత్తం 28 కోడెలు మృత్యువాత పడినట్టు అధికారులు వెల్లడించారు. మరికొన్ని కోడెలు అనారోగ్యంతో ఉండగా పశు వైద్యాధికారులు స్లైన్ థెరపీ చేస్తున్నట్టు తెలిపారు.
ఆగమేఘాల మీద కోడెల పంపిణీ
గోశాలలో కోడెల నిల్వ పెరిగిపోయినప్పటికీ పట్టించుకోని అధికారులు, మూగజీవాలు మృత్యువాతపడ్డ తర్వాత వైద్య సేవలు, పరిసరాల పరిశుభ్రత, సరైన ఆహారం అందించేందుకు కదిలారు. ఈ నెల 1న 32 మంది రైతులకు 64 కోడెలను పంపిణీ చేశారు. మిగిలిన కోడెలను కూడా పకడ్బందీగా పంపిణీ చేస్తామని అధికారులు చెప్తున్నారు.
సంరక్షణ చర్యలు చేపట్టాం
తిప్పాపురంలోని రాజన్న ఆలయ గోశాలలో కోడెలు చికిత్సకు స్పందిస్తున్నాయని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 28 కోడెలు మృతిచెందాయని, గోశాలలో ఉన్న 1300 కోడెలలో ప్రస్తుతం 14 కోడెలు అనారోగ్యంతో బాధపడుతున్నాయని పేర్కొన్నారు. వీటికి వెటర్నరీ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఆరు నెలలుగా నిలిచిపోయిన పంపిణీ
రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడెలను ఒకప్పుడు రాష్ట్రంలోని వివిధ గోశాలలకు అందించే విధానం ఉండేది. పేరులేని గోశాలలకు అక్రమంగా తరలివెళ్తుండటం, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో గతంలో కేసు కూడా నమోదు కావడంతో పంపిణీని నిలిపివేశారు. తర్వాత రైతులకు నేరుగా అందజేయాలని కలెక్టర్ కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేసి పకడ్బందీగా పంపిణీ చేశారు. ఒక రైతుకు నేరుగా రెండు కోడెలను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించి అందజేశారు.
తప్పనిసరిగా రైతు పట్టాదారు పాస్ పుస్తకం, కోడెను తీసుకెళ్లే సమయంలో రికార్డుల వివరాల నమోదు తదితర వ్యవహారాలను చూసి అందజేసేవారు. గతేడాది నవంబర్‌లో జరిగిన మూడో దశ పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఏకంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సిఫారసు లేఖతో 60 కోడెలను ఒక వ్యక్తికి అప్పగించడం వివాదాస్పదంగా మారడంతో ఆరు నెలలుగా కోడెల పంపిణీ ఆగిపోయింది.