హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు అంశం ఇంకా కాగితాలపైనే ఉన్నది. కార్యారూపమే దాల్చలేదు. అమల్లోకి వస్తాయా? రావా? అనేదానిపై సందిగ్ధత నెలకొన్నది. రాష్ర్టాలు చేపట్టే కుల సర్వేలు చెల్లబోవని కేంద్రం తేల్చిచెప్పింది. బిల్లుల ఆమోదానికీ కొర్రీలు పెడుతున్నది. ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపినా అదీ ఎటూ తేలలేదు. కానీ, కాంగ్రెస్ మాత్రం అమలవుతున్నట్టుగానే భ్రమలు కల్పిస్తున్నది. తప్పుల తడకగా నిర్వహించిన కులగణననే దేశానికి ఆదర్శమంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఢిల్లీ వేదికగా కులగణన అంశంపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ తీరుపై బీసీ సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి.
అంతా అడ్డదిడ్డం.. తప్పుల తడక!
కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామనేది కాంగ్రెస్ ఎన్నికల హామీ. అయితే, వీటిని అమల్లోకి తెచ్చే విషయంలో, బీసీ జనాభా గణాంకాలు తేల్చే విషయంలో రాష్ట్ర ప్రభు త్వం అనుసరించిన లోపభూయిష్ట విధానాలతో రిజర్వేషన్ల అంశమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలొస్తున్నాయి. బీసీ జనాభా గణనకు పాటించాల్సిన నిబంధనలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ఒకసారి బీసీ కమిషన్‌కు, మరోసారి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సర్వే నిర్వహిస్తుందని జీవోలు విడుదల చేసింది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన తరువాత కానీ డెడికేటెడ్ కమిషన్‌ను ఏ ర్పాటుచేయలేదు.
ఇంటింటి సర్వేను సమగ్రం గా నిర్వహించలేదు. ఆ గణాంకాలనూ ప్రభు త్వం బహిర్గతపరచలేదు. క్యాటగిరీల వారీగా వివరాలను స్థూలంగానైనా ప్రకటించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల గణాంకాలను జిల్లాల వారీగా బహిర్గతం చేయలేదు. రాష్ట్ర స్థాయి గణాంకాలను మాత్రమే అసెంబ్లీలో వెల్లడించింది. ఆ గణాంకాలపై విమర్శలు రావడంతో మరోసారి 2025 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీ సర్వే నిర్వహించింది. ఆయా గణాంకాలను డెడికేటెడ్ కమిషన్‌కు అందజేసి, తదనుగుణంగా నివేదికలను తె ప్పించుకుని, బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభు త్వం గత అసెంబ్లీ సమావేశాల్లో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది. బిల్ నంబర్ 3 ద్వారా విద్య, ఉపాధి రంగాల్లో, బిల్ నంబర్ 4 ద్వారా రాజకీయ రిజర్వేషన్లను పెంచుతున్న ట్టు ప్రకటించింది.
వాస్తవానికి విద్య, ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ నివేదిక, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బిల్లులను రూపొందించాల్సి ఉన్నది. కానీ, అన్ని రిజర్వేషన్లకు డెడికెటేడ్ కమిషన్ నివేదికనే ప్రాతిపదికగా తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాలకు అద్దం పడుతున్నది. ఆ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. ఈ నేపథ్యంలో రాష్ర్టాలు నిర్వహించే సర్వేలు, సంబంధించిన గణాంకాలకు సాధికారత ఉండబోదని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికీ వాటిని ఆమోదించలేదు. ఆ బిల్లులు అక్కడ ఉండగానే ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. క్యాబినెట్లో ఆమోదించి ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపించింది. గవర్నర్ సైతం వాటిని కోల్డ్ స్టోరేజీలో పెట్టినట్టు తెలుస్తున్నది. దీంతో 42% రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొన్నది.
అప్పుడు ధర్నా.. ఇప్పుడు ప్రజంటేషన్!
బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ రోజుకో డ్రామాకు తెరలేపుతున్నది. బీసీ బిల్లు ల ఆమోదానికి అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను చేపట్టలేదు. కానీ, ఆ బిల్లులను కేంద్రం ఆమోదించి 9వ షెడ్యూల్డ్ చేర్చాలని డిమాండ్ చేస్తున్నది. అనుకూల బీసీ సంఘాలను వెంటపెట్టుకుని పోయి మరీ ఢిల్లీలో గత మార్చిలో ధర్నా చేసింది. మళ్లీ మూడు నెలల వరకు ఆ ఊసెత్తలేదు. బిల్లుల ఆమోదానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. తాజాగా ఆర్డ్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలుచేయాలని రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయించింది. ప్రస్తుతం గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ సర్కారు మళ్లీ ఢిల్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అంటూ హడావుడి ప్రారంభించింది. కులగణనలో దేశానికి తెలంగాణ ఆదర్శమంటూ ప్రచారానికి దిగింది. కాంగ్రెస్ తీరును బీసీ మేధావులు విమర్శిస్తున్నారు. రాజకీయం తప్ప, అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌లో ఏ కోశాన లేదని మండిపడుతున్నారు.
రేపటితో ముగియనున్న కోర్టు గడువు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వానికి హైకోర్టు విధించిన గడువు శుక్రవారంతో ముగియనున్నది. సెప్టెంబర్ 30 నాటికి మొత్తంగా ఎన్నికల ప్రక్రియనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గత నెల 25న ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గాల గడువు ముగిసిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదంటూ నల్లగొండ, నిర్మల్, జనగామ, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు తాజా మాజీ సర్పంచులు హైకోర్టులో ఆరు పిటిషన్లను దాఖలు చేశారు. వాటిపై హైకోర్టు విచారణ చేపట్టి గత నెల తీర్పును వెలువరించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.
పంచాయతీల గ్రామ వార్డుల విభజన, సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వర్గీకరణ వంటివి పూర్తి చేయాలని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ వివరాలను అందుకున్న 60 రోజుల్లోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. మొత్తంగా ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని హైకో ర్టు ఎనిమిది పేజీల తీర్పును వెలువరించింది. అంతేకాదు, ప్రతిసారీ వాయిదా కోరడమేమిటని ఈసందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిం ది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడమే తమ ముందున్న అంశమని, 30 రోజుల గడువు కావాలని ప్రభు త్వం ఆ సందర్భంగా హైకోర్టును కోరింది. ఆ మేరకు కోర్టుకు తుది గడువు విధించింది. శుక్రవారంతో అది ముగియనున్నది. దీంతో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.