హైదరాబాద్, ఏప్రిల్ 30, (నమస్తే తెలంగాణ) : జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువును జూన్ 16వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది. జీవో-252, దాని సవరణ జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సహా మరికొందరు ఈ పిటిషన్లు దాఖలు చేశారు.
అక్రెడిటేషన్ సదుపాయాలను కొనసాగించాలని వారి తరపు అడ్వకేట్ బర్కత్ అలీఖాన్ కోరారు. ప్రభుత్వం ఇప్పటికే ఒక నెలపాటు కార్డుల గడువు పొడిగింపునకు నిర్ణయం తీసుకున్నదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. వాదనలపై స్పందించిన హైకోర్టు, జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు గడువును జూన్ 16 వరకు పొడిగించింది. తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది.